వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొత్త విధానం/మార్గదర్శకత్వంపై సముదాయపు అభిప్రాయం కోసం ప్రతిపాదనలపై చర్చల కోసం ఈ పేజీని వాడాలి. కొత్త విధానాన్ని ప్రతిపాదించేందుకు, ఈ పేజీకి ఒక ఉపపేజీని సృష్టించి అక్కడ ప్రతిపాదించాలి. చర్చ జరిగిన తరువాత నిర్ణయం వెలువడ్డాక, ఆ నిర్ణయా న్ననుసరించి విధానం పేజీని తయారుచేసుకోవచ్చు, లేదా ఉన్న విధానాన్ని సవరించుకోవచ్చు.

ప్రస్తుతం చర్చలో ఉన్న ప్రతిపాదనలు

ముగిసిన చర్చలు

అడ్డదారి:
WP:VPP
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..

తేదీ ఆకృతి ఎలా ఉండాలి

తెవికీలో సాధారణంగా మనం తేదీని 2 జనవరి 2012 లాగానో జనవరి 2, 2012 లాగానో రాస్తున్నాం. ఈ ఆకృతి మన భాషకు అంతగా అతకదనిపిస్తోంది.

  1. సుబ్బారావు 1980 మే 12 న జన్మించాడు
  2. సుబ్బారావు 12 మే 1980 న జన్మించాడు
  3. సుబ్బారావు మే 12, 1980 న జన్మించాడు
  4. సుబ్బారావు 12 మే, 1980 సం.న జన్మించడం జరిగింది.

పై మూడు వాక్యాల్లో మొదటిది మన భాషకు సహజంగా కనిపిస్తోంది. ఈ విషయంలో మన విధానం ఎలా ఉండాలి? __చదువరి (చర్చరచనలు) 15:14, 17 ఆగష్టు 2016 (UTC)

చర్చ

మొదటిదే బావుంది..--Viswanadh (చర్చ) 15:55, 17 ఆగష్టు 2016 (UTC)
నాలుగవది నప్పుతుంది అని నా అభిప్రాయము. --JVRKPRASAD (చర్చ) 16:02, 17 ఆగష్టు 2016 (UTC)
"సుబ్బారావు 12 మే, 1980 సం.లో జన్మించాడు" సరైనదనుకుంటాను గదండీ. సంవత్సరంలో అంటాం గానీ, సంవత్సరా అనం గదా! __చదువరి (చర్చరచనలు) 17:47, 18 ఆగష్టు 2016 (UTC)
నా ఉద్దేశంలో మొదటి వాక్యమే మెరుగైనది.--స్వరలాసిక (చర్చ) 17:55, 18 ఆగష్టు 2016 (UTC)
మొదటివాక్యము సరైనది. --Nrgullapalli (చర్చ) 09
17, 6 సెప్టెంబరు 2016 (UTC)

మొదటిది

  1. మొదటిదే బావుంది..--Viswanadh (చర్చ) 15:55, 17 ఆగష్టు 2016 (UTC)
  2. నా ఉద్దేశంలో మొదటి వాక్యమే మెరుగైనది.--స్వరలాసిక (చర్చ) 17:55, 18 ఆగష్టు 2016 (UTC)
  3. మొదటిదే బాగుంది __చదువరి (చర్చరచనలు) 17:57, 23 ఆగష్టు 2016 (UTC)
  4. మొదటిదే బాగుంది. --శ్రీరామమూర్తి (చర్చ) 13:33, 24 ఆగష్టు 2016 (UTC)
  5. మొదటిదే బాగుంది --Pranayraj1985 (చర్చ) 06:16, 25 ఆగష్టు 2016 (UTC)

రెండోది

మూడోది

అక్షరాలలో వ్రాసేటప్పుడూ నెల, తేది ఆ తర్వాత సంవత్సరం రాయడం మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:03, 24 ఆగష్టు 2016 (UTC)

మనవాళ్ళు కొంతమంది ఈ విధానం వ్రాసేటప్పుడు సుబ్బారావు జనవరి 12 1953 అని వ్రాసేందుకు అవకాశం ఉంది. కామాలు లేకపోతే అర్థం మారుతుంది. అంకెలు కలిసిపోతాయి.JVRKPRASAD (చర్చ) 23:48, 24 ఆగష్టు 2016 (UTC)

నాలుగోది

  1. నాలుగవది నప్పుతుంది అని నా అభిప్రాయము.--JVRKPRASAD (చర్చ) 16:02, 17 ఆగష్టు 2016 (UTC)
  2. మాకు చిన్నప్పుడు తేదీ, నెల మరియు సంవత్సరము అని ఇప్పటి వరకు వ్రాయడము పద్ధతి మాకు మా మాష్టర్లు తప్పుడు రకంగా నేర్పారేమోనని ఇప్పుడు ఇతరుల ద్వారా భవిష్యత్తులో అనుమానించాల్సి రావాల్సి వస్తోందా అని అనుకోవాల్సి ఉంటుందేమో ? JVRKPRASAD (చర్చ) 13:46, 24 ఆగష్టు 2016 (UTC)

ఫలితం

సభ్యుల అభిప్రాయాలను పరిశీలించాక, 1980 మే 12 అనే రూపమే తెవికీ అనుకూలిస్తుందని సభ్యులు భావించాఅరు కాబట్టి ఆ రూపాన్నే తెవికీ స్వీకరించాలని నిర్ణయించడమైనది. __చదువరి (చర్చరచనలు) 09:11, 6 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కి.మీ / కిమీ

కిలోమీటర్లను తెవికీలో కి.మీ.', కి.మీ కిమీఅని, మీటర్లను మీ., మీ అని రాస్తున్నాం. ఇంగ్లీషులో చుక్కలు పెట్టడం లేదు - km అని, m అనీ రాస్తున్నారు. మరి వీటి విషయంలో మన విధానం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి. మీ అభిప్రాయాలు చెప్పగలరు.__చదువరి (చర్చరచనలు) 12:40, 23 ఆగష్టు 2016 (UTC)

చర్చ

కి.మీ.

  1. ఈ విధంగానే ఉండాలి. కి.మీ. పదానికి చుక్కలు లేకపోతే అది కిమీ అనే ఒక పదంగా అవుతుంది. JVRKPRASAD (చర్చ) 00:15, 24 ఆగష్టు 2016 (UTC)
  2. ఆంగ్ల వికీ అంత ప్రాచుర్యం తెలుగు భాషకు లేదు. నా వరకు కి.మీ. గానే ఉండాలని కోరుతున్నాను. ఇదే పద్ధతి మిగిలిన కొలమానాలకు కూడా వర్తింపజేయండి.--Rajasekhar1961 (చర్చ) 13:04, 24 ఆగష్టు 2016 (UTC)
  3. ఇదే సరైనది. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:04, 24 ఆగష్టు 2016 (UTC)
  4. ఇదే సరైనది --Pranayraj1985 (చర్చ) 06:18, 25 ఆగష్టు 2016 (UTC)
  5. ఇదే సరియైనది. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 06:23, 25 ఆగష్టు 2016 (UTC)
  6. కి.మీ గానే వుంటే బాగుంటుంది. --Nrgullapalli (చర్చ) 09:21, 6 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కిమీ

  1. __చదువరి (చర్చరచనలు) 17:57, 23 ఆగష్టు 2016 (UTC)

ఫలితం

మెజారిటీ సబ్యుల అభిప్రాయాల కనుగుణంగా కి.మీ. అనే రూపాన్నే తెవికీ స్వీకరించాలని నిర్ణయించడమైనది. __చదువరి (చర్చరచనలు) 09:11, 6 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నెలల పేర్లు

మార్చ్, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల పేర్లు ఇంగ్లీషు ఉచ్చారణ ప్రకారం హలంతాలు. ఏప్రిల్, జూన్ తప్పించి మిగతా వాటిని తెలుగులో అజంతాలుగా మార్చి రాయడం జరుగుతూంటుంది. పాత రచనల్లో ఏప్రిల్ ను ఏప్రియలు అని రాసేవారు, ప్రస్తుతం అలా రాయడం అరుదు. కాబట్టి ఆ రెంటినీ పక్కనబెడితే మిగతా నెలల పేర్లు ఎలా రాయాలో మనం నిర్ణయించాఅలి. ఆయా పేర్ల కోసం గూగిలిస్తే ఫలితాలిలా ఉన్నాయి:

మార్చ్, 1,24,000 మార్చి 72,30,000
ఆగస్ట్ 4,53,000 ఆగస్టు 47,70,000
సెప్టెంబర్ 47,80,000 సెప్టెంబరు 2,45,000
అక్టోబర్ 49,60,000 అక్టోబరు 2,30,000
నవంబర్ 49,80,000 నవంబరు 1,63,000
డిసెంబర్ 54,50,000 డిసెంబరు 2,73,000

గమనిక: పై అన్వేషణలో తెవికీని మినహాయించాను.

మార్చ్ ఆగస్ట్‌లు అజంతాలవైపు మొగ్గు చూపిస్తే, మిగతా వాటికి హలంతరూపాలు ఎక్కువగా వాడుతున్నారు. మన పత్రికలు కూడా ఒక విధానాన్ని పాటించడం లేదు, రెండు రూపాలనూ వాడేస్తున్నాయి. మనం మాత్రం ఒక రూపాన్ని ఎంచుకుందాం. మీ అభిప్రాయాలు చెప్పండి.

అజంత రూపం ఎందుకు వాడాలంటే:

  1. మన భాషకు సహజం. అసలు మన భాష ప్రత్యేకతే అది.
  2. అవి ఇంగ్లీషు పదాలు కాబట్టి అలాగే వాడదామని అనుకోరాదు. అలా అనుకునే పనైతే భాషలో కొచ్చిన పరభాషా పదాలన్నీ అలాగే పలకాల్సి ఉంటుంది. అపుడు మన భాష సహజ గుణాన్నీ, రూపునీ కోల్పోతుంది. ఏ భాషైనా పరాయి భాషా పదాలను తీసుకుంటే దాన్ని తమకనుగుణంగా మార్చుకుంటుంది -పందికొక్కు బ్యాండికూట్‌ ఐనట్టు. వాళ్ళు pandikokku అని అనడం లేదు, మనం గమనించాలి. మనం కూడా రైల్ అనో రెయిల్ అనో అని రాయడం లేదు, రైలు అని అంటున్నాం.
  3. పదాంతంలో లో కలిపి రాయాలంటే తేలిక, "^" పెట్టనవసరం లేదు.

హలంత రూపం ఎందుకు వాడాలంటే

  1. మార్చ్ ఆగస్ట్ లు తప్పించి మిగతావి హలంత రూపాలే ప్రచురంగా ఉన్నాయి
  2. ఏప్రిల్, జూన్ లను అజంతాలుగా అసలు రాయడం లేదు (దాదాపు). అలాంటపుడు అన్నీ అలాగే రాయొచ్చు గదా, ఒకే పద్ధతిలో ఉంటాయి.
__చదువరి (చర్చరచనలు) 13:25, 23 ఆగష్టు 2016 (UTC)

చర్చ

ఏప్రిలు, జూను అనడం అసహజంగా ఉంటుంది. అది వ్యవహారంలో లేదు. కానీ మిగతా అజంత రూపాలు వ్యవహారంలో ఉన్నాయి. వ్యవహారంలో అజంత రూపం ఉన్నప్పుడు, అది జనానికి అర్థమవుతున్నప్పుడు మనం అజంత రూపమే ఎంచుకోవడం మేలని నా భావన.--పవన్ సంతోష్ (చర్చ) 14:42, 23 ఆగష్టు 2016 (UTC) (పి.ఎస్. ఇటువంటివి నిర్ధారించేప్పుడు గూగులించడం మనకు అనువుగా ఉంటుందన్నది నిజమే కానీ ప్రస్తుతం తెలుగు అంతర్జాలం ఎదుగుతున్న దశలో ఉన్నందువల్ల అది పూర్తిగా భాషా స్వరూపాన్ని వ్యక్తపరచదు కనుక మనం మరో పద్ధతిని కూడా ప్రయత్నించాల్సివుంటుందేమో. ఈ విషయమై ఆలోచించి చూడాలి)
....పాత పుస్తకాల్లో చూడొచ్చు. ఇప్పుడొస్తున్న పుస్తకాల్లోనూ చూడవచ్చు. తెలుగు ఆకాడమీ లాంటివాళ్ళు ఏం చెబుతున్నారో చూడవచ్చు. __చదువరి (చర్చరచనలు) 17:57, 23 ఆగష్టు 2016 (UTC)
పరాయి భాషా ద్వారా వచ్చిన పదాలన్నింటికీ అంజతాల రూపంలో పెట్టడం వల్ల కొన్నింటికి ఎబ్బెట్టుగా ఉండవచ్చు. కాబట్టి వాడుకలో ఉన్న ఉచ్ఛారణకే ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:08, 24 ఆగష్టు 2016 (UTC)
వాడుక ఏప్రిల్, జూన్ అనే ఉండాలి లేదా ఏప్రియలు, జూను అని తెలుగులో ఎక్కడైనా వ్రాసుకుంటామంటే వ్రాసుకోవచ్చును. JVRKPRASAD (చర్చ) 23:50, 24 ఆగష్టు 2016 (UTC)
మార్చకుండా ఏప్రిల్, జూన్ అనడం బాగుంటుంది --Nrgullapalli (చర్చ) 09
25, 6 సెప్టెంబరు 2016 (UTC)

అజంతం

  1. మనం అజంత రూపమే ఎంచుకోవడం మేలని నా భావన.--పవన్ సంతోష్ (చర్చ) 14:42, 23 ఆగష్టు 2016 (UTC)
  2. అజంతమే ఉండాలి__చదువరి (చర్చరచనలు) 17:57, 23 ఆగష్టు 2016 (UTC)
  3. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రియలు, మే, జూను, జూలై, ఆగష్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు మరియు డిసెంబరు అని ఉండాలని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 00:18, 24 ఆగష్టు 2016 (UTC), JVRKPRASAD (చర్చ) 13:27, 24 ఆగష్టు 2016 (UTC)
  4. అన్ని నెలల పేర్లు అజంతా రూపాలలోనే ఉండాలని నా సూచన. ఏప్రిలు, జూను నెలలు కూడా మెల్లగా వాడుకలోకి వస్తాయి.--Rajasekhar1961 (చర్చ) 12:59, 24 ఆగష్టు 2016 (UTC)

హలంతం

ఫలితం

మెజారిటీ సభ్యుల అభిప్రాయాలకు అనుగుణంగా ఏప్రిల్, మార్చి, జూన్, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు అనే రూపాలను వాడాలని నిర్ణయించడమైనది. __చదువరి (చర్చరచనలు) 09:11, 6 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అతడు-అతను

తెలుగు వికీపీడియా వ్యాసాల్లో నిష్పాక్షికత కోసం మనం ఏకవచనాన్ని పలు చర్చల అనంతరం స్వీకరించాం. అందువల్ల మనం చేశారు, వచ్చారు అన్న రూపాలు కాక చేశాడు, వచ్చాడు అన్న రూపాలు వాడుతున్నాం. ఈ క్రమంలో బహువచనం కాబట్టి ఆయన, ఆవిడ కాక అతను/ఆమె అన్నవే స్వీకరిస్తున్నాం. కానైతే అతను-అతడు అన్న వాటిలో దేన్నివాడాలన్నది కూడా నిర్దిష్టంగా నిర్ణయించుకుంటే ఏకవచన-బహువచన ప్రయోగాల విషయంలో ఒక స్పష్టత వస్తుంది, అంతా ఒక చేతిమీదుగా రాసినట్టు ఒకే శైలిలో వ్యాసాలు రూపొందించుకునే ప్రయత్నంలో ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం అతడు-అతను, ఇతడు-ఇతను అన్న రూపాలను ఎవరికి తోచిన విధంగా వారు వాడుతున్నాం. అతడు అని రాసిన పేరాలోనే మరోచోట అతను అని రాయడం, ఇతను అని ప్రారంభించిన వ్యాసంలో ఇతడు అని వాడడం గమనించవచ్చు. మానవీయంగా వెతికి లెక్కిస్తే దాదాపు 15 వందల పైచిలుకు వ్యాసాల్లో అతడు, ఇతడు, ఇతను అన్న ప్రయోగాలు, రెండు వేల వ్యాసాల్లో అతను అన్న పదప్రయోగాలు కనిపిస్తున్నాయి.
కాబట్టి అతడు-ఇతడు, అతను-ఇతను అన్న రూపాల్లో ఏది స్వీకరించాలో నిర్ణయిస్తే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 06:42, 13 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అభిప్రాయాలు-చర్చ

  • అతను-ఇతను: తెలుగు సాహిత్యంలోనూ, పత్రికా ప్రయోగంలోనూ విస్తారంగా ఆయన-చేశాడు అన్న ప్రయోగం కనిపిస్తోంది. కానీ అది మనకు బహువచనమన్న కారణంగా ఆమోదయోగ్యం కాదు కనుక అతను-ఇతను అన్నది ప్రతిపాదిస్తున్నాను. ఎందుకంటే 1. ఇతడు వచ్చాడు అనడంలో రెండుసార్లు డుకార ప్రయోగం జరిగి కనీస గౌరవానికీ భంగంగా కనిపిస్తూంది, 2. వ్యవహారికంగా అతను వచ్చివెళ్ళాడు అని తప్ప అతడు వచ్చివెళ్ళాడు అన్న ప్రయోగం అసహజం. తెవికీపీడియాలో వ్యవహారిక భాష, సరళమైన భాష ప్రయోగించాలన్న నియమం ఉన్నది. కాబట్టి నేను అతను-ఇతను అన్న ప్రయోగాన్ని సమర్థిస్తున్నాను. ఆమె అన్నదాని విషయంలో ఈ సమస్య లేదు కాబట్టి ఆమె కొనసాగాలి.--పవన్ సంతోష్ (చర్చ) 06:49, 13 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  • అతను-ఇతను అని రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం.రవిచంద్ర (చర్చ) 13:05, 14 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  • "ఆయన" అన్న ప్రయోగం చేస్తే బాగుంటుందేమో ! T.sujatha (చర్చ) 12:14, 14 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  • గూగుల్ సెర్చ్ లో "అతను" కు 67,10,00,000, "అతడు" కు 10,70,000 ఫలితాలు వచ్చాయి. దీనిని బట్టి "అతను" ప్రయోగం విస్తారంగా వాడుకలో ఉన్నట్లు కనిపిస్తుంది. వ్యవహారికంగానూ "అతను" అనే పదం సరియైననది సమర్థిస్తున్నాను. "అతను" ఉపయోగించి రెండు వ్యాసాలు కూడా రాసాను. ఈ పదం బాగుందని అనిపించింది. --కె.వెంకటరమణచర్చ 16:54, 14 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  • నేను సమర్ధించను. వ్యాసంలో సందర్భాన్ని బట్టి ఈ రెండు పదాలే కాదు, అనేక పదాలు వాడుకోవచ్చును.JVRKPRASAD (చర్చ) 03:15, 15 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  • వ్యక్తుల గురించి వ్యాసాలు వ్రాసేటప్పుడు మనం ఏ వ్యక్తి గురించి వ్రాస్తున్నామో అతని గురించి "అతడు/అతను/ఆయన/ఆమె" అని కాకుండా "ఇతడు/ఇతను/ఈయన/ఈమె" అని సంబోధిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అప్పుడు మనం ఎవరి గురించి వ్రాస్తున్నామో వారు మన ముందు ఉన్నట్లే ఉంటుంది. అదే వ్యాసంలో ఇతరుల గురించి అంటే ఆ వ్యక్తి తండ్రి లేదా గురువు వగైరాల గురించి వ్రాసినప్పుడు వారిని "అతడు/అతను/ఆయన" అని సంభోదిస్తే సరిపోతుంది. ఇకపోతే అతడు/ఇతడు అనే పదాలను అతను/ఇతను అనే పదాలతో మార్పుచేయాలన్న ప్రతిపాదనను సమర్థించడం లేదు. ఆయన/ఈయన పదాలను బహువచనాలుగా కూడా అంగీకరించను. ఆయన వచ్చాడు, ఈయన వెళ్ళాడు వంటి ప్రయోగాలు అంగీకారయోగ్యమైనవే. ప్రస్తుతం ఉన్నవాటిని మార్పులు చేయకుండా అలాగే ఉంచి కొత్తగా వ్రాసే వ్యాసాలలో అతను/ఇతను వాడితే సరిపోతుంది. --స్వరలాసిక (చర్చ) 02:05, 19 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
    • స్వరలాసిక గారూ, అతను, ఇతను అనే పదాలతో ఇప్పుడున్న అతడు, ఇతడు అన్నవి పదాలు మార్చాలా అన్నది కాదండీ. తెలుగు వికీపీడియాకు ఒక శైలి అన్నది ఏర్పరుచుకోవాలి కాబట్టి మనం రాసేదంతా ఒకచేతి మీద రాసినట్టుగా రావాలి కాబట్టి మనకొక శైలి ఉండాలి. అందులో భాగం ఈ ప్రయత్నాలు. అతడు/అతను/ఆయన అన్న మూడిటిలో ఏదో ఒకదాన్ని మన మూలసూత్రాలకు అనుగుణమైనదని ఎంచుకుంటే ఆ ప్రకారమే వికీపీడియాలో రాయాల్సివస్తుంది. ఏదో ఒకటి కాదు, మూడూ ఉండవచ్చు అన్నప్పుడు ఇన్‌కన్సిస్టెన్సీ వస్తుంది. దానికితోడు మీరు సూచించినట్టు వ్యాసంలో ఉన్న విషయాన్ని ఇతను అని, వ్యాసంలోని విషయం కానివారిని అతను అని అనడం బావుంటుంది. అదీ మనం స్వీకరిస్తే, అలానే అందరం రాయాల్సివుంటుంది. ఒక శైలి అంటూ నిర్ణయించుకున్నాకా, అదే అనుసరించాలి కదా. --పవన్ సంతోష్ (చర్చ) 06:06, 19 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఫలితం

ఈ అంశంపై ఆసక్తి ఉండి, పై చర్చలో పాల్గొనని నిర్వాహకులు కానీ, సీనియర్ సభ్యులు కానీ దయచేసి జరిగిన చర్చను పరిశీలించి ఏకాభిప్రాయం గురించి ప్రయత్నించడం కానీ, మరేదైనా విధానాలు ఆమోదించే పద్ధతిలో ఈ చర్చను ముగించడం కానీ చేయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 10:50, 29 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చాఫలితం

చర్చలో పాల్గొన్న ఆరుగురిలోను, ఒకరు "సందర్భానుసారం అనేక పదాలు వాడుకోవచ్చ"ని రాసారు. విధాన నిర్ణయాల కోసం చర్చ జరిపేటపుడు ఇటువంటి అభిప్రాయాలు నిర్ణయానికి దోహదపడవు కాబట్టి ఈ అభిప్రాయాన్ని పరిశీలనలోకి తీసుకోవడం లేదు. నలుగురు "అతను", "ఇతను" అని రాయాలని అభిప్రాయపడ్డారు. ఒకరు "ఆయన" అనాలని రాసారు.

వికీసోర్సులో విషయపు పేజీల్లో వెతికితే వచ్చిన ఫలితాలు ఇలా ఉన్నాయి:

  • ఆయన, ఈయన: 1276
  • అతను, ఇతను: 274
  • అతడు, ఇతడు: 689

దీన్నిబట్టి, పాత తెలుగు పుస్తకాల్లో "ఆయన", "ఈయన" అనే వాడుక ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు.

గూగుల్ ఫలితాలు ఇలా ఉన్నాయి:

  • ఆయన, ఈయన: 4,98,00,000 + 59,40,000 = 5,57,40,000
  • అతను, ఇతను: 68,80,00,000 + 33,30,000 = 69,13,30,000
  • అతడు, ఇతడు: 10,90,000 + 79,000 =11,69,000

సరళ వ్యావహారిక భాష వాడుతున్న వర్తమాన కాలంలో "అతను", "ఇతను" ఎక్కువగా వాడుతున్నారని గూగుల్ ఫలితాలు చెబుతున్నాయి.

మరొక ముఖ్యమైన విషయం: భాషావేత్త చేకూరి రామారావు గారు రాసిన తెలుగు వాక్యం పుస్తకంలో "అతను" ను విస్తృతంగా వాడారు ("అతడు" ను కాదు).

వికీలో వ్యావహారిక భాషను వాడాలన్న విధానం ఉంది కాబట్టి, చర్చలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది సమర్ధించారు కాబట్టీ.. "అతను", "ఇతను" లను వికీపీడియాలో వాడాలని వికీవిధానంగా నిర్ణయించడమైనది. __చదువరి (చర్చరచనలు) 10:23, 30 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వికీలో వ్యక్తి సంబోధనలు

  • వ్యాసంలో సందర్భాన్నిబట్టి పురుషులకు అతడు,ఇతడు,అతను,ఇతను,ఆయన,ఈయన వంటి పదాలు, అలాగే స్త్రీలకు ఆమె,ఈమె,ఆవిడ,ఈవిడ వంటి పదాలు వ్రాయవచ్చును అని నా అభిప్రాయం. అలాగే వారు, వీరు, వచ్చారు, వెళ్ళారు అనే పదాలు చివర 'రు ' అనే అక్షరం బహువచనం సూచిస్తున్నదని వికీ తెలుగు (పండితులు) పెద్దలు అంటున్నారు, కానీ తెలుగు వాడుకలో ఈ పదాలు కూడా ఏకవచనానికి వాడతాము.JVRKPRASAD (చర్చ) 01:51, 15 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
    • జేవీఆర్కే ప్రసాద్ గారూ! తెలుగు వాడుకలో బహువచన క్రియాపదాలు వ్యక్తికి వాడి గౌరవించడం ఒకానొక సంప్రదాయమని తెలియక కాదు తెలుగు వికీపీడియన్లు ఏకవచనాన్ని స్వీకరించింది. మనం రాసేప్పుడు వ్యక్తిగా పవన్ సంతోష్ కానీ, జేవీఆర్కే ప్రసాద్ గారు కానీ, సుజాత గారు కానీ కనిపించకుండా వికీపీడియా అన్నదే కనిపిస్తుంది కాబట్టి వికీపీడియా కొందరికి గౌరవ వాచకంగా బహువచనం, కొందరికి ఏకవచనం ప్రయోగిస్తే పక్షపాత ధోరణితో ఉంటుంది కాబట్టి ఇది స్వీకరించారు. ఒకవేళ అందరికీ రు పెట్టాల్సివస్తే, ఒసామా బిన్ లాడెన్ అనేక ఉగ్రవాద దాడులకు రూపకల్పన చేశారు అని రాయలేం కనుక అందరికీ డు పెడుతున్నాం. అయితే ఈ చర్చ కేవలం అతను-అతడు వరకే పరిమితం తప్ప రు-డుల చర్చ కాదని, కాబట్టి విస్తృతమైన బహువచనాల గురించిన చర్చ ఇక్కడ చేయలేమని మనవి. --పవన్ సంతోష్ (చర్చ) 03:00, 15 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
        • పవన్ సంతోష్ గారు, మీకు ఒసామా బిన్ లాడెన్, అనేక ఉగ్రవాదులు గురించి మాత్రమే మీకు గొప్ప వ్యక్తులుగా ఉదహరిస్తున్నట్లు ఉంది. మనము ఏం గొప్ప వ్యక్తులు ? గొప్పవాళ్ళని 'డు ' అంటాము, మనకి మాత్రం గారులు తప్పకుండా ఉండాలి, లేకపోతే గొడవలు కదా! మీకు చెడ్డవారి లాంటి వారి గురించి కాదు నా అభిప్రాయం నేను వ్రాసింది. అతికొద్ది మంది చెడ్డవాళ్ళకోసం అధిక శాతం మందిని ఒక గాటన కడతారా ? అందరికీ ఒకేలా వ్యాసాలు వ్రాయాలా ? విపీడియాలో ఎన్ని వందలమంది ఏకవచనం వ్రాయమని నిర్ణయించారో లింకు ఇవ్వండి. కనీసం ఏకవచనం వ్రాయాలని ఎవరు చెప్పారో లింకు ఇక్కడ ఉంచండి. ఏకవచనం అనేది ఎల్లకాలం శిరోధార్యం కాదు అని అభిప్రాయం. అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. కేవలం అతను-అతడు వరకే పరిమితం మీరెలా ఇక్కడ పరిమితం చేస్తారు. నేను కూడా నా పరిమితి కూడా వ్రాసాను. దీనికి స్పందించే వాళ్ళు స్పందిస్తారు. అందుకే దీన్ని విడగొడుతున్నాను. మీ చర్చ మీరు చేసుకోండి. కాని మీ కేవలం అతను-అతడు వరకే పరిమితం అనేది నేను ఆమోదించను.JVRKPRASAD (చర్చ) 03:10, 15 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASADగారూ పై చర్చ అతడు-అతను అన్న అంశం విభాగాన్ని విడదీసి ఇది వేరు చేశారు, సంతోషం. మీ ప్రశ్నల్లో కొన్నిటికి నేను నా అవగాహన మేరకు సమాధానం రాస్తాను.
  • ఎన్ని వందలమంది నిర్ణయించారో: వికీపీడియా విధానాల విషయంలో ఎప్పుడైనా ఎందరు నిర్ణయించారన్న ప్రశ్న ఉదయించకూడదు, ఏయే అంశాల ప్రాతిపదికన నిర్ణయించారన్న ప్రశ్నే రావాలి, వికీపీడియా 5 మూలస్తంభాలు ఈ నిర్ణయంలో ఏమేరకు ప్రతిఫలిస్తున్నాయో చూడాలి. వికీపీడియాలో విధానాలు (పాలసీలు) నిర్ణయించేప్పుడు మందిబలంతో జరిగే ఓటింగు ప్రక్రియ ఆమోదయోగ్యం కాదు, దానికి భిన్నంగా "నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వికీపీడియా యొక్క విధానాలను మరియు మార్గదర్శకాలను గౌరవిస్తూ, వాటిని దృష్టిలో పెట్టుకుంటూనే, అందరు వికీపీడియా వాడుకరుల యొక్క సహేతుకమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ముందుకు సాగే ప్రక్రియ"గా దీన్ని వికీపీడియా ఏకాభిప్రాయం విధానం చెప్తోంది. ఏకాభిప్రాయం అంటే ఏకగ్రీవమూ కాదు, ఓటింగు ప్రక్రియా కాదు.
  • ఏకవచనం గురించి ఎక్కడ ఉంది: తెలుగు వికీపీడియాలో "వ్యాస పేరుబరిలో" ఏకవచన ప్రయోగం ప్రస్తుతం అమలులో ఉంది. దీనిని గురించి చెప్పే విధానం వికీపీడియా:ఏకవచన ప్రయోగం అన్నదగ్గర మనం క్రోడీకరించుకున్నాం. దాని చర్చ పేజీలోనూ, ఇతర చోట్లా మీతో సహా చాలామంది చర్చలు జరిపారు. మనం చర్చల్లో ఎన్ని అభిప్రాయాల్లోనైనా వ్యక్తం చేయవచ్చు, కానీ ఒక్కమారు నిర్ణయం జరిగాకా మాత్రం ఆ నిర్ణయాన్ని అమలుచేయాలి అన్నది నా అభిప్రాయం, నిశ్చితమైన నమ్మకం. మరోమారు మళ్ళీ చర్చించుకోవచ్చు, కానీ అవతలివారు చెప్పిన వాదన అర్థం చేసుకుని దానికి ప్రతివాదన లభిస్తేనే చేయడం వల్ల తిరిగి తిరిగి అవే విషయాలు మాట్లాడుకుని అవే నిర్ణయాలు చేసే పనివుండదు. అన్నిటికీ మించి విషయాన్ని చర్చించి నిర్ణయించాలి. వాదనలో బలం ఉంటేనే వాదన నెగ్గుతుంది. సరే ఇదిలా ఉంచితే నాకు వ్యక్తిగతంగా "చెప్పారు", "చేశారు" అని రాయడమే అలవాటు, వికీపీడియాలో నిర్ణయం అంయింది కదాని వికీపీడియా వ్యాసాల్లోలో మట్టుకు "చేశాడు" అని రాస్తున్నాను.
  • ఒసామా ఉదాహరణలో ఉగ్రావాదులను గొప్పవారిగా భావించనట్టుగా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, అక్కడ ఒసామాను ఉగ్రవాది, ప్రమాదకరమైన వ్యక్తి అన్న అర్థంతోనే వాడాను. నేను వ్యక్తిగతంగా నా స్వంత పుస్తకంలో రాసుకోవాల్సి వస్తే "ఒబామా నెగ్గారు", "ఒసామా చనిపోయాడు" అనే రాస్తాను. అక్కడ వ్యక్తిగా పవన్ సంతోష్ ఒబామా పట్ల కనీస గౌరవం ఉన్నవాడు, ఒసామా అంటే గౌరవం లేని మనిషి. కానీ వికీపీడియాలో అలా రాయకూడదు, ఎందుకూ అంటే మంచిదైనా, చెడ్డదైనా వికీపీడియా ఒక అభిప్రాయానికి కట్టుబడి ఉన్నట్టు ఉండకూదు కనుక. రాసినది ఒసామా అంటే అసహ్యం ఉన్న పవన్ సంతోష్, జేవీఆర్కే గారలైనా వారి వారి అభిప్రాయాలు వికీపీడియా వ్యాసం వ్యక్తం చేయదు, చేయకూడదు.
  • చర్చల్లో జేవీఆర్కే ప్రసాద్ గారిని గారు అనడం నా ఇష్టం ఎందుకు అంటే ఇది వ్యక్తిగతమైన పాఠ్యం కనుక. కింద నా సంతకం ఉంటుది కనుక. అలా వ్యాసాల్లో సంతకాలు ఉండవు, ఉండరాదు. ఉదాహరణకు చర్చల్లో వాడుకరి:pranayraj1985ని ప్రణయ్ రాజ్ గారు అని పిలిస్తే పవన్ సంతోష్ అనే వ్యక్తి వాడుకరి:pranayraj1985 పట్ల చూపించే గౌరవం అని అర్థం అవుతుంది, అదే ప్రణయ్‌రాజ్ వంగరి అన్న వ్యాసంలో గౌరవవాచకాలు నేను పెట్టాననుకోండి, అప్పుడు వికీపీడియా గౌరవం చూపినట్లు అవుతుంది. కాబట్టి కనీస గౌరవం తప్ప ప్రత్యేక గౌరవం కానీ, ప్రత్యేక అగౌరవం కానీ ఎవరికీ వికీపీడియా చేయకూడదు, వికీపీడియన్లు వారి వారి వ్యక్తిగత స్థాయిలో చేయవచ్చు.

మీరు అడిగిన ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు ఇవి, ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:06, 15 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారు, మీరు వికీపీడియనులు వ్యాసాలు ఒకసారి చదవండి, వ్యాసాలు ఎలా వ్రాసారో మీకు తెలుస్తుంది. ఉదా: డా.రాజశేఖర్ గారి వ్యాసం ఎలా వ్రాసారో అలాగే వ్రాస్తే బాగానే ఉంటుంది కదా ! అన్ని వ్యాసాలు ఒకే రీతిగా ఉండాలా లేక వ్యక్తులును బట్టి ఉండాలో కూడా ఒక సందేహం వాడుకరులకు కూడా ప్రశ్న ఉదయిస్తుంది. అందరి గురించి, అన్ని వ్యాసాలు ఒకే రీతిగా, తీరులో వ్రాయాలనే పాలసీ నా మనసుకు అంతగా ఒప్పటము లేదు. మీ స్పందనలకు సంతోషం, నాకు ఎవరితోనూ సమస్యలు లేవు, పెట్టుకోను. ఇక్కడ నిర్ణయాలు అన్నీ అమలు పరిచేది కేవలం కొద్దిమంది మాత్రమే. వారి పాలసీలు తప్ప మరొకరివి అమలు జరగవు. దేనికైన కొత్తవాటికి అయినా వారి అభిప్రాయాలు తీసుకుని అమలు చేసుకుంటే చాలా తేలిక. మిగతావారి అభిప్రాయాలు లెక్కకోసం, భంగపడటం కోసం మాత్రమే. ఇది సత్యం. మీ స్పందనలకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 05:16, 15 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారూ నేను వికీపీడియన్ల వ్యాసాలన్నీ చదివాను, అవన్నీ ఏకవచన ప్రయోగం విషయంలో సరిదిద్దాలి. అవి ఎలా ఉన్నాయన్నదాన్ని బట్టి ఈ చర్చ చేయట్లేదు, ఎలావుండాలని తెలుగు వికీపీడియా విధానం చెప్తోంది అన్నదాని ఆధారంగా చేస్తున్నాను. పాలసీకి విరుద్ధంగా ఉన్న ప్రయోగాలు, పాలసీకి అనుగుణంగా దిద్దాలి. అలానే వికీపీడియా వ్యాసం ఎవరి పట్లా విశేష గౌరవాన్ని కానీ, అగౌరవాన్ని కానీ చూపకూడదన్నది కేవలం కొందరు చర్చించి రూపొందించిన ఒకానొక పాలసీలోనే ఉన్నది కాదు వికీపీడియా రెండవ మూలస్తంభం "వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు." అంటూ దాన్నే స్పష్టం చేస్తోంది. --పవన్ సంతోష్ (చర్చ) 05:27, 15 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మాండలికాలు - ప్రామాణికత

అంశం

వ్యక్తులుగా ప్రతీవారికి స్థానికతతో పాటు వారి భాషకు మాండలికం ఉంటుంది. కోట్లాదిమందిని లక్ష్యం చేసుకున్న సంస్థలు ఈ స్థానికతల నుంచి కొంత స్వీకరించి ప్రామాణిక భాషను తయారుచేసుకోవడం చూశాం. (ఉదాహరణకు ఈనాడు, సాక్షి వగైరా పత్రికల వేర్వేరు భాషలు చూడండి) అయితే ప్రతీవారికి విజ్ఞానాన్ని అందించే ఉద్దేశంతో ప్రారంభమైనదీ, ప్రతీవారినీ రాయమని ఆహ్వానిస్తున్నదీ అయిన వికీపీడియాలో ఈ వైవిధ్యాన్ని ఏం చేయాలి? ప్రామాణికమని దేనిని స్వీకరించాలి అన్నది ప్రస్తుతం మన శైలీ నిర్ణయంలో ఒక కీలకమైన అంశం. సభ్యులు దీనిపై ఆలోచించవలసిందని, తమ తమ అభిప్రాయాలు, పరిశీలనలు పంచుకోవాలని కోరుతున్నాను.

ఆవశ్యకత

వచ్చాడు, వచ్చిండు, వచ్చినాడు అన్నవి మూడు వేర్వేరు మాండలికాలకు చెందని ప్రయోగాలు. వచ్చాడన్నది మనలో చాలామంది ప్రస్తుతం ఉపయోగిస్తున్నది, అయితే వచ్చిండు అన్న ప్రయోగాలు కూడా ఆయా ప్రాంతాలకు చెందిన వికీపీడియన్లు చేయడం ప్రారంభించారు. ఇటీవలి కాలంలో తెలుగు నాట తెలంగాణ పత్రికలు ప్రారంభమై ప్రామాణిక భాషను విస్తృతీకరించి, తెలంగాణ స్థానీయత దానిలో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూండడం కూడా వాడుకరులను ప్రభావితం చేస్తూందని, భవిష్యత్తులోనూ చేస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ప్రస్తుతం ఈ అంశాన్ని సబ్జెక్టివ్‌గా చర్చించడం అవసరమని ప్రతిపాదిస్తున్నాను.

ఆంగ్ల వికీపీడియా ఉదాహరణ

ప్రపంచభాషల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఆంగ్ల భాషలో అమెరికన్, బ్రిటన్, ఆస్ట్రేలియన్, ఇండియన్ వంటి అనేక తీవ్ర భేదాలున్న మాండలికాలు ఉన్నాయి. అయితే తెలుగు వంటి భాషలకు భిన్నంగా ఈ ఆంగ్ల భాషా రూపాలన్నిటా తమదైన ప్రామాణికత ఉన్నది. అంటే అమెరికన్ స్టాండర్డ్ ఇంగ్లీష్, బ్రిటీష్ స్టాండర్డ్ ఇంగ్లీష్, ఇండియన్ స్టాండర్డ్ ఇంగ్లీష్ వంటివి ఉన్నాయి, ఈ ప్రామాణిక భాషల్లో పత్రికా భాష, పరిశోధన భాష ఇప్పటికే ఏర్పడివుంది. అయితే అంతర్జాతీయ పాఠకులను (అంటే వివిధ స్థానీయతలకు చెందినవారు) ఉద్దేశించి రాసే ఆంగ్ల వికీపీడియాలో ఏ విధమైన భాష తీసుకోవాలన్న ప్రశ్నకు - ఏ ఒక్క మాండలికాన్నో ఏకైక ప్రామాణిక భాషగా వికీపీడియా స్వీకరించదని నిర్ణయించారు. కనుక ఒక వ్యాసానికి ఏ విధమైన భాషా శైలి స్వీకరించాలన్నదానిపై కొన్ని మార్గదర్శకాలు రూపొందించుకున్నారు. దాని ప్రకారం 1. అన్ని భాషా శైలులకు సరిపడే సాధారణ శైలిని అవకాశం ఉన్నంతవరకూ స్వీకరించడం 2. వ్యాసంలోని అంశం యొక్క స్థానీయతను బట్టి ఆ స్థానిక రకాన్ని వాడడం అంటే ముంబై గురించి ఇండియన్ ఇంగ్లీష్‌లో, అమెరికా అంతర్యుద్ధం గురించి అమెరికన్ ఇంగ్లీష్‌లో, సిడ్నీ గురించి రాసేప్పుడు ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్‌లో, జార్జ్ బెర్నార్డ్ షా గురించి బ్రిటీష్ ఇంగ్లీష్‌లో, దక్షిణాఫ్రికా జాతి వివక్ష గురించి సౌతాఫ్రికన్ ఇంగ్లీష్‌లో రాయడం పద్ధతి. ఈ పద్ధతి వల్ల ఆ ప్రాంతాలకు సంబంధించిన వ్యాసాలు ఆ ప్రాంతానివి అవుతాయని భ్రమించరాదు. 3. పై రెండు సూత్రాలు వర్తించని చోట్ల వ్యాసంలో అప్పటికే ఏ మాండలిక శైలి వాడుతూంటే ఆ మాండలిక శైలినే కొనసాగించాలి, అవసరమైతే ఈ వ్యాసం ఫలానా ఇండియన్ ఇంగ్లీష్‌లో ఉందని ఓ మూస పెట్టవచ్చు.
అయితే ఆంగ్ల వికీపీడియా ఉదాహరణ పరిశీలించినప్పుడు ఆంగ్ల భాషలో పలు ప్రామాణిక భాషలు ఏర్పడి దాదాపుగా స్థిరపడిన విషయాన్నీ, తెలుగులో పలు ప్రామాణిక భాషల లేమిని, ఆ ఏర్పాటు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతూండి ఇంకా స్థిరపడలేదన్ని విషయాన్నీ గుర్తుచేయదలిచాను. ఇప్పుడు అన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి సభ్యులు ఈ విషయంపై ఆలోచనలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:35, 6 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]